రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
రాజ్యసభలో రైల్వే సమస్యలపై ధ్వజమెత్తిన ఎంపీ రవిచంద్ర
లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం:
రాముడి పేరుతో రాజకీయం చేసే ఎన్డీఏ ప్రభుత్వం.. అదే రాముడు నడయాడిన భద్రాచల క్షేత్రంతో పాటు, తెలంగాణలోని రైల్వే సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. సోమవారం రాజ్యసభలో బడ్జెట్లో రైల్వే శాఖ కు కేటాయించిన నిధులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన తెలంగాణ కు సంబంధించిన పలు రైల్వే సమస్యలను ప్రస్తావించారు. 'రఘుపతి రాఘవ రాజారామ్' అనే రాముడి కావ్యంతో చర్చను ప్రారంభించిన ఆయన దక్షిణ అయోధ్య గా పిలవబడే భద్రాచలం క్షేత్రానికి రైలు మార్గం అనుసంధానించే భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైన్ దశాబ్దాల నుంచి కలగా ఉంటోందని, ఈ కల సాకారం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. భద్రాచల క్షేత్రం ప్రాశస్తాన్ని గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లాల పునర్విభజణలో కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేసి రాముడి పై తనకున్న అపార భక్తిని చాటుకున్నారని గుర్తు చేశారు. రైల్వే ఆదాయానికి అధిక శాతం నిధులు సమకూరుస్తున్నా.. తెలంగాణ లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని వాపోయారు. ఉత్తర, దక్షిణ భారత దేశానికి ప్రవేశ ద్వారంగా ఉన్న ఖాజీపేటను రైల్వే డివిజన్ గా గుర్తించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు 48 శాతం ఆదాయం సమకూరుస్తున్న ఖాజీపేటను ప్రత్యేక డివిజన్ గా గుర్తిస్తే.. లాభదాయకంగా ఉంటుందని రవిచంద్ర ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లాలో చిన్న కోడూరు రైల్వే స్టేషన్ మంజూరు, నిజామాబాద్, మంచిర్యాల, భద్రాచలం రోడ్ నుంచి తిరుపతికి నూతన రైలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణంలో ఉన్న రైల్ ఓవర్ బ్రిడ్జి పనుల వేగవంతం, కొత్త బ్రిడ్జిల మంజూరు, రైల్వే స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని రవిచంద్ర కోరారు.
Comment List