సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్
లోకల్ గైడ్:
భూ భారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించబడేలా సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. శనివారం గట్టు మండలంలోని ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల దీర్ఘకాల సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్ర భుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ధరణీ స్తానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ ఓ ఆర్ మార్పులు చేర్పులు, వారసత్వ భూములు, సాదా బైనామాలు, ఓ.ఆర్.సి వంటి సేవలు సులభతరం అవుతుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని,దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. భూ సమస్యలపై రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారా నికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తారని తెలిపారు. ధరణి వ్యవస్థలో భూ హక్కులపై తలెత్తే వివాదాలకు అప్పీల్ అవకాశం లేక నేరుగా సివిల్ కోర్ట్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు భూభారతి చట్టం - 2025 ద్వారా రైతులకు తహసీల్దార్ నుండి ఆర్డీఓ,ఆర్డీఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు అధికారపరమైన అప్పీల్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గట్టు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినప్పటికీ, వాటిలో 90 శాతం సమస్యలను పరిష్కరించామని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు. గ్రామ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ పరిపాలన అధికారిని ప్రభుత్వం త్వరలో నియమించనుందని తెలిపారు. అవగాహన సదస్సుల అనంతరం అధికారులు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. భూసమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టం గురించి ప్రతి రైతు తెలుసుకోని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలువురి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,గట్టు తహసీల్దార్ సలీముద్దీన్, ఎంపీడీఓ చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comment List