పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్.
లోకల్ గైడ్ : పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, మెరుగైన విద్య, మౌలిక వసతులు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అంగన్వాడీ టీచర్‌లకు ఆదేశించారు. శనివారం గట్టు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ సెంటర్‌లో ఉన్న పిల్లలు, తల్లులు, బాలింతలకు అందుతున్న అంగన్వాడీ సేవల గురించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పిల్లల బరువు, ఎత్తులను పరిశీలించి, మొబైల్ యాప్‌ను చెక్ చేశారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణను క్రమంగా చేపట్టి ఖచ్చితమైన ఎత్తులు, బరువులు యాప్ లో నమోదు చేయాలని అంగన్‌వాడీ టీచర్‌ను ఆదేశించారు. పిల్లలను ఆంగ్లం అక్షరమాల,తెలుగు వర్ణమాలపై ప్రశ్నించారు. పిల్లలు బాగా చెప్పారు, వారి పునాది మరింత బలపడేందుకు ఇంకా మెరుగుపరచాలని అన్నారు. పోషన్ ట్రాకర్, ఎన్.హెచ్.టీ.ఎస్ యాప్‌లలో ఎప్పుడూ డేటాను అప్‌డేట్ చేసి, సరిగ్గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. గర్భిణుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతులు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, అస్పిరేషన్ బ్లాక్ ఫెల్లో అఫ్జల్ అంగన్ వాడి టీచర్ వెంకట్రావమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Comment List