భూభారతి భూమి హక్కు చట్టం 20 25 ను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి .
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
లోకల్ గైడ్ :
భూ భారతి ( భూమి హక్కుల చట్టం- 2025) ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మోఖా మీద ఉన్న రైతులకు హక్కులు కల్పించడమే భూ భారతి ఉద్దేశం అన్నారు.భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా, గుడిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ధరణి పోర్టల్ లో రికార్డులలో తప్పులు జరిగితే సరి చేసుకునేందుకు అవకాశం లేదని, భూ భారతిలో సరిచేసుకోవచ్చని తెలిపారు. రైతులు ఎంతవరకు, ఏ భూమి మీద మోఖాపై ఉన్నారో అదే శాశ్వతం అన్నారు. జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి గ్రామ పాలన అధికారులతోపాటు, లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించనుందని తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.భూ భారతి చట్టంలో భూముల సమస్యల పరిష్కారానికి ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ,భూ భారతిలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని, అధికారులు భూముల సర్వే కోసం వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి వారికున్న భూములను చూపించాలని కోరారు. రికార్డుల నిర్వహణ కోసం ఇందిరమ్మ ఇండ్ల పై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ ఇందిరమ్మ ఇండ్ల జాబితా పరిశీలనకు ప్రతి 200 మంది లబ్ధిదారులకు ఒక గజిటెడ్ అధికారిని నియమించామని, వారు పారదర్శకంగా విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ భూ భారతితో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, అలా కాకుండా భూ భారతిలో తహసిల్దార్ వద్దనే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.దేవరకొండ అడిషనల్ ఎస్ పి మౌనిక మాట్లాడుతూ ధరణిలో భూ హద్దుల వివాదాలు ఉండేవని, భూ భారతిలో అలాంటి వివాదాలకు అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సర్వే కోసం కొత్త సర్వేయర్లను నియమించనుందని, ఎవరైనా భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకునెందుకు ప్రతి గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉన్నారని, అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భూ భారతి చట్టంతోపాటు, నియమ నిబంధనలు ఒకేసారి తయారు చేసిందని, రికార్డుల నిర్వహణ, సవరణ, రిజిస్ట్రేషన్ ,మ్యుటేషన్, సాదా బైనామ ,పౌతి,వంటి అంశాలను ఆయన వివరించారు.గుడిపల్లి తహసిల్దార్ మధు హాసిని, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Comment List