నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
లోకల్ గైడ్ తెలంగాణ,జనగాం జిల్లా ప్రతినిధి:
జఫర్ గడ్ మండలం తిడుగు గ్రామంలో వరంగల్ బస్టాండ్ నుండి గర్నేపల్లి, తిడుగు, సాగరం మీదుగా జఫర్ గడ్ వరకు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తిడుగు, సాగరం గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న విషయాన్నీ గుర్తించి, ప్రత్యేకంగా ఆర్టీసీ డీఎం కి బస్సు సర్వీస్ ప్రాముఖ్యతను వివరించి బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రోజు కూడా బస్సు సర్వీస్ ఆగకూడదని ఆర్టీసీ డీఎం కి సూచించారు. తుడుగు గ్రామంలో ఇప్పటికే 35లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి మంజూరు ఇచ్చానని, అలాగే 5లక్షలతో ఓపెన్ జిమ్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే గ్రామానికి బీటి రోడ్డు, మహిళా కమ్యూనిటీ హల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తిడుగు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదని వెల్లడించారు. రేపు జరిగే బహిరంగ సభను అధిక సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List