ప్రజా సమస్యలపై మార్చి 20 వరకు సర్వేలు

ప్రజా సమస్యలపై మార్చి 20 వరకు సర్వేలు

- 20 నుండి 30 వరకు మండల, మున్సిపల్ కేంద్రాల్లో ఆందోళనలు
- ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
- భూ సమస్యలు పరిష్కరించాలి
- వారబందీ రద్దు చేసి నిరంతరం నీటి సరఫరా చేయాలి
- వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి
- మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

 లోకల్ గైడ్,ఖమ్మం:

ప్రజా సమస్యలపై ఈ నెల 10 నుండి 20 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నామని, మార్చి 20 నుండి 30 వరకు ఆయా మండల, ము న్సిపల్ కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకూ ఇచ్చిన హామీలను అమలు చేయులేదన్నారు. గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాలు రేషన్ కార్డు లేకపోవడంతో చాలా కుటుంబాలకు అమలు కావడం లేదన్నారు. రుణమాఫీ నాలుగు ధఫాలుగా చేసినా ఇంకా పూర్తి కాలేదన్నారు. రైతుభరోసాది అదే పరిస్థితి అన్నారు. భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయడానికి ఉపాధి హమీ పనులకు లింక్ పెట్టడం వల్ల చాలా మంది నష్టపోనున్నారన్నారు.18 ఏళ్లు నిండిన మహిళలకు 2500 రూపాయల పథకం ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కౌలు రైతులకూ భరోసా ఇస్తామని చెప్పారే తప్ప అమలుకు పూనుకోలేదన్నారు. సన్న రకాల బోనస్ ఇంకా పెండింగ్‌లో చాలా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప ఎక్కడా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదన్నారు. ఆరుగ్యారంటీల అమలు కోసం రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్లి సిపిఎం కార్యకర్తలు సర్వే చేయనున్నారని తెలిపారు. సోమవారం నుండి 20వ తేదీ వరకు సర్వే జరుగుతుందని, అనంతరం 20 నుండి 30 వరకు మండల, మున్సిపల్ కేంద్రాల్లో ఆందోళనలు జరుగతాయన్నారు. భూభారతి బిల్లును అమలు చేసి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. రఘునాధపాలెం మండలం శివాయిగూడెం కాలనీలోని పేదలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. 2012లో 3 వేల మందికి అక్కడ పట్టాలు ఇచ్చారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాటి పట్టాలను రద్దు చేయాలని చూడగా ఆందోళనలు చేశామన్నారు. ఇల్లు కట్టని వారి పట్టాలు రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారని, ఇంకా 900 మంది ఇల్లు కట్టుకోలేదన అన్నారు. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారబంధిని రద్దు చేయాలి నీటి సరఫరా లేక సాగర్ ఆయకట్టు ఎండిపోతోందని, వెంటనే వారబందీ పద్ధతిని రద్దు చేయాలని నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గోదావరి జలాలు ఎన్ఎస్‌పికి రావడంతో వైరా నుండి సత్తుపల్లి ప్రాంతానికి ఇబ్బంది లేదని, బిబిసి కెనాల్ కింద పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. వెంటనే వారబందీ పద్ధతిని రద్దు చేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పల్లెల్లో పాలన అస్తవ్యస్థంగా ఉందని, వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎo రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్ మాదినేని రమేష్,  యర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News