రేషన్ దుకాణాలలో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్; చౌక ధరల దుకాణాలలో స్టాక్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలోని 8 వ నెంబర్ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్నాయి, ఇప్పటివరకు ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయ్యింది, ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాల గురించి రేషన్ డీలర్ కాశీరాంను ప్రశ్నించి, స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. రేషన్ షాపులోని బియ్యం నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలించారు. స్టాక్ వివరాల పట్టిక కనిపించకపోవడంతో కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద కుటుంబాల వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న నేపథ్యంలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాలలో తప్పనిసరిగా స్టాక్ వివరాల పట్టికను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో విధిగా దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న డీఎస్ఓ అరవింద్ రెడ్డిని ఆదేశించారు. ఆయా షాపులకు ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు కేటాయించబడినాయి, ఎంత మంది కార్డులు కలిగి ఉన్నారు, ఎంత మందికి బియ్యం పంపిణీ పూర్తయ్యింది, ఇంకనూ ఎంత పరిమాణంలో బియ్యం స్టాక్ మిగిలి ఉంది తదితర అన్ని వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.
Comment List