రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు....
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
*ఉగాది నుండి రేషన్ కార్డుల క్రింద సన్న బియ్యం సరఫరా
*పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పొంగులేటి
లోకల్ గైడ్ తెలంగాణ:
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టి, రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను కట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.గురువారం మంత్రి పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఇందిరమ్మ గృహ నిర్మాణానికి, సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుని గృహ నిర్మాణానికి, ఎస్టిపి (ఎస్.డి.ఎఫ్.) నిధులు 87 లక్షలతో చేపట్టిన అంతర్గత సి.సి. రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, అభివృద్ధి పనులు కూడా చేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.గతంలో జరిగిన పొరపాట్లను సరి చేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 57 వేల 626 ఉద్యోగాల భర్తీ చేస్తూ నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేశామని అన్నారు.మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల 450 కోట్లు ఖర్చు చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఉగాది నుంచి సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 20 వేల 676 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామని, సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించామని, పండించే ప్రతి ఎకరానికి 12 వేల రైతు భరోసా క్రింద, మొదటి విడత 6 వేల రూపాయలు నెలాఖరులోగా అందరికి అందజేస్తామని అన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అద్భుతమైన పథకాన్ని రూపొందించారని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 50 వేల నుంచి 4 లక్షల వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వేల మందికి తగ్గకుండా ఇచ్చేందుకు చర్యలు తీసుకొని, దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. పేదలకు 4 విడతలలో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిలు లెవల్ తర్వాత లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయల మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం అందుతుందని అన్నారు. పైలెట్ గ్రామంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులు కూడా పరిశీలించి వారికి కూడా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. స్థానికంగా ఉన్న అటవీ భూముల వివాదాలను రాబోయే 20 రోజుల్లో పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. సీతారామ ప్రాజెక్టు కాల్వల క్రింద తూము నిర్మించి రామచంద్రాపురం, ఎరుగట్ల గ్రామాల చెరువు నింపేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలతో ప్రత్యేకంగా స్త్రీ టీ క్యాంటీన్ లను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 4 వేల వరకు వివిధ వ్యాపార యూనిట్లను మహిళలచే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 2 పెట్రోల్ పంప్ లను మహిళా సంఘాలు నిర్వహించేలా ఏర్పాటుకు చర్యలు చేపట్టామని అన్నారు.
Comment List