దేశ చరిత్రలో ఇదే మొదటిసారి...
ఉమెన్స్‌డే స్పెషల్..
ప్రధాని మోదీ సభకు మహిళా పోలీసులతో భద్రత..
లోకల్ గైడ్ :
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా గుజరాత్ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించనుండటం విశేషం. ప్రధాని పాల్గొనే ఈ ఈవెంట్‌లో కేవలం మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. హెలిప్యాడ్ నుంచి వేదిక వరకూ ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహరా కాయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇక ఈ కార్యక్రమానికి భద్రత కల్పించేవారిలో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకూ 2,300 మందికి పైగా మహిళా పోలీసులు ఉంటారని మంత్రి తెలిపారు. అందులో 2,100 మందికిపైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 16 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ఉంటారని మంత్రి వివరించారు. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోంశాఖ కార్యదర్శి అయిన నిపుణా తోరావణే భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.
Comment List