వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో,లోకల్ గైడ్ తెలంగాణ
వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారానే మంచి పర్యావరణం, ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. నవభారత్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల ను జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాఠశాల అసెంబ్లీ లో పాల్గొని విద్యార్థులతో పాటుగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో అసంబ్లీ చేయు విధానాన్ని కొనియాడారు. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పర్యావరణం, ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. వ్యర్ధాలను సరైన పద్ధతిలో నిర్వహించకపోతే ఆరోగ్యం, పర్యావరణం పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన విద్యార్థులకు తెలిపారు. వ్యర్ధాలను సేకరించడం, శుద్ధి చేయడం, పారవేయడం వంటి క్రమబద్ధమైన ప్రక్రియను వేస్ట్ మేనేజ్మెంట్ అంటారని తెలిపారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, ప్రక్రియలను సృష్టించడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా పెంపొందించవచ్చు అని తెలిపారు. వంటశాలలోని వ్యర్ధాలనుండి కంపోస్ట్ పిట్ ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయవచ్చని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు అందరూ పాఠశాలలో వ్యర్ధాలను సరైన పద్ధతుల్లో నిర్వహించి పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు.కంపోస్ట్ పిట్ లను ఉపయోగించడం వలన పర్యావరణానికి, మొక్కల పెరుగుదలకు, నేల సారవంతానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అన్నారు. అదేవిధంగా మట్టి ద్వారా ఇటుకల తయారీ ప్రాధాన్యత మరియు తయారీ గురించి విద్యార్థులకు కలెక్టర్ వివరించారు. పాఠశాల ఆవరణలో ఔషధ మొక్కలు మరియు కూరగాయ మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న పిల్లలకు పుస్తకాలు, పెన్నులను బహుకరించారు. రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధికి చేపట్టవలసిన పనులకు సంబంధించి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, పాఠశాల ప్రిన్సిపల్ మైధిలి, పాఠశాల మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List