రైతాంగాన్ని ఆందోళన పరిచే ప్రయత్నాలను ప్రతిపక్షాలు మానుకోవాలి: మంత్రి తుమ్మల
లోకల్ గైడ్, హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్లు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనట్లు, ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా విమర్శించారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. PACS జగిత్యాలలో అందుబాటులో ఉన్న యూరియా బస్తాలు 890, అక్కడ వేచిఉన్న రైతుల సంఖ్య 80 కూడా దాటదు. ఆ రోజు సాయంత్రం వరకు ఎంతమంది రైతులు వచ్చినప్పటికి, అందరికి యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరిగింది. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నా, సోసైటీ తెరిచే సమయం కంటే ముందే అక్కడకి వచ్చిన కొంతమంది రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు వరుసలో ఉంచి, స్వప్రయోజనం కోసం వీడియో తీసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దానిని సదరు నాయకులు కుటిల రాజకీయాల కోసం వాడుకొని రైతులను ఆందోళనకు గురిచేయడం బాధాకరమని మంత్రి తెలిపారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకేన్లు జారీ చేశారనడం కూడా అవాస్తవం. కేవలం రైతుల ఎక్కువ సంఖ్యలో వచ్చినందుకు, పోలీసు సిబ్బంది ఒకరిద్దరు వస్తే వారే టోకెన్లు జారీ చేశారని, రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. గత యాసంగి కంటే ఈ యాసంగిలో ఇప్పటికే 1.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. ఇంకా 40 వేల టన్నుల యూరియా ఈ నెలలోనే పంపిణీ చేస్తున్నామని, ఇదీగాక మార్చినెలలో కూడా లక్షా 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరాకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఎవరో ఒకరు కేవలం వార్తల కోసం, పాస్ బుక్కులు లేదా చెప్పులు లైన్లో పెట్టించి, యూరియా కొరత అనే వార్తలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరమని తెలియజేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఆందోళన పరిచే ఇటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా మానుకోవాలని సదరు ప్రతిపక్ష నాయకులకు మంత్రిగారు హితవు పలికారు. ఎక్కడైనా సరఫరాలో కాని, పంపిణీలో కాని నిజంగా సమస్య ఉంటే సంబంధిత వ్యవసాయాధికారులకు తెలియచేస్తే, యూరియా పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రైతాంగానికి విజ్ఙప్తి చేయడం జరిగింది.
Comment List