నేడే ఒడిశాలో సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభం
13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి
గనిని లాంఛనంగా ప్రారంభించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం గల అతి పెద్ద గని
గని జీవితకాలం 38 ఏళ్ళు
సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి
భద్రాది కొత్తగూడెం, లోకల్ గైడ్:
సింగరేణి సంస్థ తన 13 దశాబ్దాల చరిత్ర లో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించనుంది. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ ను నేడు ఏప్రిల్ 16వ తేదీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై బొగ్గు గనులు నిర్వహిస్తున్న సింగరేణి ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్ ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెట్టడాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ...
2016 మే నెలలో ఈ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు సింగరేణికి కేటాయించినప్పటికీ, అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్ళ సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ,ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవ చూపుతూ అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని క లిసి విజ్ఞప్తులు చేశారు. అలాగే భట్టి విక్రమార్క మల్లు ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ, సంబంధిత అధికారులతోనూ సంప్రదింపులు జరిపి గని ప్రారంభానికి మార్గం సుగమం చేశారు. దీంతో చివరికి సింగరేణీయుల చిరకాల స్వప్నం సాకారమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ వల్ల సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించింది. తద్వారా వార్షిక అధికోత్పత్తి సాధనకు మార్గం సుగమమై సంస్థ ఆర్థిక పటిష్టతకు దోహదపడనుంది.
నైనీ బొగ్గు బ్లాక్ విశేషాలు
ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తవ్వితీయటానికి అవకాశం ఉంది.ఈ గని లో ఉత్పత్తి పూర్తిస్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నులు అనగా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది.సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్ట్ గనుల కన్నా ఇదే అతి పెద్ద గని కానున్నది.ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38 సంవత్సరాల పాటు ఈ గని నుండి బొగ్గు తవ్వి తీయనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం గల సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డెన్ (పై మన్ను) తొలగిస్తుండగా ఈ గనిలో మాత్రం ఒక టన్ను బొగ్గుకు కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. కనుక ఈ గని సింగరేణికి లాభదాయకమైనదే అని భావిస్తున్నారు.
ఈ గనిలో మేలైన జీ - 10 రకం నాణ్యమైన బొగ్గు లభిస్తోంది. గనిలో, ఓవర్ బర్డెన్ తొలగించడానికి, బొగ్గు తవ్వకానికి , బొగ్గు రవాణాకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్ట్ లను అప్పగించారు .ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వేసైడింగ్ కు రవాణా చేసి ,అక్కడి నుండి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు.అయితే ఈ ప్రాంతంలోగల ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి ఒక ప్రత్యేక 60 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. మరో మూడేళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.నైనీ బొగ్గు బ్లాకు కోసం మొత్తం 2255 ఎకరాల భూమి సేకరించారు. దీనిలో 1935 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి ఉంది.
Comment List