రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు......
లోకల్ గైడ్ :
రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తానొక సాధువును మాత్రమే అన్నారు. భవిష్యత్తులో యోగి దేశ ప్రధాని అవుతారని వినిపిస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టేశారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యక్తిగత అంశాలను ఆయన వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడమే తన ప్రాథమిక బాద్యత అని, తమ పార్టీ తనకు ఆ బాధ్యత అప్పగించినట్లు చెప్పారు. ప్రధాని సామర్థ్యం ఉన్న వ్యక్తి అని మద్దతు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. రాజకీయాలు తనకు ఫుల్‌టైం ఉద్యోగం కాదన్నారు. వ్యక్తిగతంగా తాను ఒక సాధువునన్నారు. రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉంటారన్న ప్రశ్నకు బదులిస్తూ.. దీనికి కూడా టైం ఫ్రేమ్ ఏమీ లేదన్నారు.
రాజకీయం, మతం అంశాలను వివరిస్తూ.. మతాన్ని ఓ ప్రదేశానికి పరిమితి చేశారని, రాజకీయాలను కొంత మంది చేతుల్లోకి వదిలేశారని, ఇక్కడే సమస్య ఉత్పన్నం అవుతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే, దాని వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని, అందరి మంచి కోసం రాజకీయం చేస్తే, దాని వల్ల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. ఒకవేళ స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటే, అప్పుడు అది కొత్త సవాళ్లను సృష్టిస్తుందని, ఒకవేళ ఎవరైనా ఉన్నత ఆశయాలకు అంకితం అయితే, అప్పుడు ప్రగతి ద్వారాలు తెరుచుకుంటాయన్నారు.భారతీయ సంప్రదాయంలో మతానికి, స్వప్రయోజనానికి సంబంధం లేదన్నారు. భారతీయ తత్వ బోధనలో మతాన్ని స్వప్రయోజనాలతో లింక్ చేయలేదన్నారు. భారతీయ మతతత్వం రెండు అంశాలను బోధిస్తుందన్నారు. ప్రాపంచిక జీవనంలో ప్రగతితో పాటు ఆధ్యాత్మిక విముక్తి కల్పిస్తుందన్నారు. రెండు విధానాల్లోనూ సేవాభావం ఉందన్నారు. కానీ రాజకీయాలతో మాత్రం కేవలం సేవా శక్తిని చాటవచ్చు అని యోగి తెలిపారు.మతపరమైన వ్యక్తిగా ఉంటారా లేక రాజకీయవేత్తగా భావిస్తారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఒక పౌరుడిగా పనిచేస్తున్నానని, తనకు తాను ప్రత్యేకమైన వ్యక్తిగా భావించకోవడం లేదన్నారు. ఒక పౌరుడిగా తనకు రాజ్యాంగ బాధ్యతలు ముందుంటాయన్నారు. తనకు దేశమే ముఖ్యమన్నారు. దేశం సురక్షితంగా ఉంటే, అప్పుడు మతం సేఫ్‌గా ఉంటుందని, మతం భద్రంగా ఉంటే, అది సంక్షేమానికి దారి తీస్తుందని సీఎం యోగి వెల్లడించారు.
Comment List