జర్నలిస్టుపై అక్రమ కేసు ఎత్తివేయాలి
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
లోకల్ గైడ్ :
సూర్యాపేట ఎస్పీని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె. నరసింహను పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్( టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ఒక జర్నలిస్టుపై నూతనకల్ పోలీసులు పెట్టిన అక్రమ కేసుపై ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య జిల్లా ఎస్పీ దృప్టికి తీసుకువెళ్ళారు. జ్యోతి పత్రికకు చెందిన వెంకటసాయిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని ఆయన ఎస్పీని కోరారు. అనంతరం మామిడి సోమయ్య మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులపై పలు చోట్ల పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.ఇటీవల వెలుగులోకి వచ్చిన బైక్ రైడర్ భయ్యా సన్నీయాదవ్ పై పోలీసులు పెట్టిన బెట్టింగ్ కేసులో హైదరాబాద్ కు చెందిన యువ జర్నలిస్టు వెంకటసాయిపై సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్పారు. ఎలాంటి విచారణ లేకుండా,సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం అనుమానంతో అతనిని దోషిగా నిర్ధారించి, అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. సాధారణంగా తమ జర్నలిస్టులు నైతికంగా ఎలాంటి తప్పులు చేయరని, ఒకవేళ తప్పులు చేసినట్లు రుజువైతే చట్టపరంగా శిక్షలకు అర్హులుగా ఉంటారని అన్నారు. ఎడిటర్ నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న తమ జ్యోతి జాతీయ దినపత్రిక హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల తో సాయి పబ్లికేషన్స్ యాడ్స్, అతిపెద్ద మార్కెటింగ్ సంస్థగా వెలుగొందుతూ మంచి వార్తలు అందిస్తున్నదని అన్నారు. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి వార్తలను విస్తృతంగా ప్రసరిస్తుంది. అంతేకాకుండా ఈ సంస్థ నెలకు రెండు మేగాజైన్లు కూడా సొంతంగా కలిగి ఉన్నది. వెంకటసాయి ఈ సంస్థలో కరస్పాండెంట్ కమ్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంత గొప్ప సంస్థగా పేరు తెచ్చుకోవడాన్ని ఓర్వలేని కొంత మంది దుష్టశక్తులు చెడు ప్రచారాలు చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగులకి, జ్యోతి దినపత్రిక సీఈవో వెంకట సాయికి ఎలాంటి సంబంధం లేదు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సరైన దర్యాప్తు నిర్వహించ నిజమైన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అంతకుముందు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాయిని శ్రీనివాస రావు, జిల్లా కార్యదర్శి బుక్కా రాంబాబు, మాజీ కార్యదర్శి పాల్వాయి జానయ్య, ఎడిటర్ నాంపల్లి శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి వంగాల వెంకన్న తదితరులు పాల్గొని ఎస్పీ కి శుభాకాంక్షలు తెలియజేసి యూనియన్ మెమొంటోను అందజేశారు.
Comment List