భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకం
- జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ
లోకల్ గైడ్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. బుధవారం కే.టీ దొడ్డి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని, చట్టం మరియు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందిం చిందన్నారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేశారని వివరించారు. భూ పరిపాలన వ్యవస్థ అనేక దశల్లో అభివృద్ధి చెందిందని, గతంలో జరిగిన కొన్ని చట్టాలు, సర్వేలు, పాస్‌బుక్‌లు, ఆర్.ఓ.ఆర్ చట్టం వంటి చర్యలను గుర్తుచేశారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనున్నదని తెలిపారు. ఈ చట్టాన్ని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. చట్టం రూపొందించే సమయంలో రైతుల సంక్షేమం కోసం వారి సమస్యలను ప్రస్తావించి, అభిప్రాయాలను చట్టంలో ప్రతిబింబించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో ధరణి ద్వారా మన జిల్లా టాప్ 5లో ఉండగా, భూ భారతి చట్టంతో ప్రక్రియలు త్వరగా పూర్తి అవుతాయని తెలిపారు.ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ పొందుపరచారని, దీనివల్ల ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేయాలో రైతులకు అర్థమయ్యేది కాదని అన్నారు. భూభారతిలో 6 మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని వివరించారు. భూ భారతి చట్టంలో తహసిల్దార్ స్థాయి నుండి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే అప్పీల్ వ్యవస్థను వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని,భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. వార సత్వంగా వస్తున్న యజమానులకు పేరు మార్పులు చేయవచ్చని తెలిపారు. పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గడువు తర్వాత ఆటోమేటిక్ గా మూటేషన్ జరుగుతుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని,దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని అన్నారు. గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి భూ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. భూ భారతి చట్టం మొదట రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాల్లో పైలెట్‌గా అమలవుతుందని, తరువాత ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో నిర్వహించి, అవసరమైతే మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని తెలిపారు.రాబోయే రోజులలో భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తారని తెలిపారు. భూమి హక్కుల రక్షణకు భూ భారతి చట్టం ఉపయోగకరమైందని, రైతులు దీన్ని అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హనుమంతు,కేటీ దొడ్డి తాసిల్దార్ హరి కృష్ణ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List