నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం...
లోకల్ గైడ్: శివసత్తుల సిగాలు, జోగినులు, పోతరాజుల విన్యాసాలు, పూనకాలు, బోనాలు, డప్పు దరువులతో కోర మీసాల స్వామి కొలువు దీరిన కొమురవెల్లి మల్లన్న క్షేత్రం మార్మోగుతోంది.. ప్రతిఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహించే కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే ఆదివారం నుంచి ఫాల్గుణ మాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్ని గుండాలతో మహా జాతర ముగుస్తుంది.
నేడు మల్లన్న కల్యాణోత్సవంతో మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రాన్ని అందంగా ముస్తాబు చేశారు. అశేష జనవాహినికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
కాశీ పీఠాధిపతి పర్యవేక్షణలో మల్లన్న కళ్యాణం..
కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన సింహాసనాధీశ్వర 1008 జగద్గురు మల్లికార్జున విశ్వ రాధ్యా శివ చార్య పర్యవేక్షణలో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లన్న కల్యాణం జరుగునుంది. వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు, వధువులు మేడలాంబ, కేతాకాంబ తరపున మహా దేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాలతలంబ్రాలు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించనున్నారు. కల్యాణ మహోత్సవానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరు కానున్నారు. అదే విధంగా దృష్టి కుంభము, ఏకాదశ రుద్రాభిషేకం, రథోత్సవం (బండ్లు తిరుగుట) కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటి పుట్ట మట్టి విగ్రహం..
కొమురవెల్లి ఇంద్రకీలాద్రి పర్వతంపై 11వ శతాబ్దంలో స్వామి వారు వెలిసినట్లు ప్రతీతి. గొర్రెల కాపరికి కలలో కనిపించి నీవు దర్శించిన కోరికలు నెరవేరతాయని చెప్పినట్లుగా భక్తుల విశ్వాసం. కాకతీయుల కాలం నుంచి వీర శైవ సంప్రదాయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పుట్ట మట్టి చే తయారు చేసిన స్వామి వారి విగ్రహం ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా భక్తుల పాలిటి కల్పతరువై విలసిల్లుతుంది. స్వామి వారి విగ్రహం నాభిలో పుట్టు లింగం కలదని ప్రతీతి. మల్లన్న వీరశైవులకు చెందిన మేడలాదేవిని, యాదవుల ఆడ బిడ్డ అయిన కేతలాదేవిని వివాహమాడారు. వీర శైవాగమ శాస్త్రం ప్రకారం వీర శైవార్చుకులు గర్భాలయంలో వేదమంత్రోచ్చరారణలతో సేవలను నిర్వహిస్తారు. యాదవులు పట్నాలు వేసి పూజలు నిర్వహిస్తారు. స్వామి వారికి పట్నము వేయించి నివేదన సమర్పించడం తరతరాల ఆచారం. మల్లన్న స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన గంగరేగు చెట్టు, ఒళ్లుబండ మరో ప్రత్యేకత. అలాగే కోడెలను కట్టి మొక్కు చెల్లించే ఆచారం ఉంది.
Comment List