అమెరికా-రష్యా దేశాధినేతల చారిత్రాత్మక సమావేశం..
వేదిక కాబోతున్న భారత్..?
లోకల్ గైడ్:రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ అంశంపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని, ఇది మాస్కో - వాషింగ్టన్ మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మార్పును సూచిస్తుంది. ఈ పరిస్థితుల్లో చర్చలు జరిపేందుకు రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన దేశంగా భారత్ కనిపిస్తోంది. ఈ భేటీ జరిగితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశముందని భావిస్తున్నారు.
పరస్పరం కత్తులు దూసుకునే అగ్రరాజ్యాలు అమెరికా-రష్యా దేశాధినేతలు కలుసుకోబోతున్నారా? అందుకు శాంతి వేదికగా భారత్ మారనుందా? ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతోంది. అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో చారిత్రక భేటీ జరిపే అవకాశం ఉందని రష్యాలో జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు మూడో ప్రపంచయుద్ధాన్ని తలపించేలా సాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఇంతకాలం అమెరికా ఉక్రెయిన్ వెనుక నిలిచి ఎగదోస్తూ వచ్చింది. తమ శత్రుదేశం రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధ సామిగ్రిని అందిస్తూ వచ్చింది. అయితే ఈ యుద్ధం కేవలం ఆ రెండు దేశాలపైనే కాకుండా, మిగతా ప్రపంచంపై కూడా పడింది.
ప్రపంచ గోధుమ పాత్ర (వీట్ బౌల్)గా పేరొందిన ఉక్రెయిన్ నుంచి గోధుమ ఉత్పత్తి తగ్గిపోయి కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తింది. అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తి చేసే రష్యాపై ఆంక్షల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి పరోక్షంగా అన్ని దేశాల్లో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్.. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపాలని భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ సమావేశంపై సానుకూతల వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరూ ఎక్కడ భేటీకానున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలో రెండు దేశాలకు మిత్రదేశంగా ఉన్న భారతదేశమే అత్యంత అనుకూలమైన వేదిక అని చర్చ జరుగుతోంది.
అగ్రరాజ్యాధినేతల సమావేశానికి అనుకూలమైన వేదికను ఎంపిక చేసే పనిలో రష్యా నిమగ్నమైంది. ఈ సమావేశాన్ని నిర్వహించగల దేశాల జాబితాను ఆ దేశం సిద్ధం చేస్తోంది. ఇంతలో, భారతదేశం పేరు అత్యంత అనుకూలమైన దేశంగా చర్చ జరుగుతోంది. రష్యా అధికారవర్గాలతో సంబంధం ఉన్న చాలా మంది ఈ సమావేశం భారత గడ్డపై విజయవంతమవుతుందని నమ్ముతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా, దాని మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ నిష్పాక్షికమైన, స్వతంత్ర వైఖరిని అవలంబించింది. భారత వైఖరిని అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ 2025లో భారత్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా తాను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌లో పర్యటించారు. ప్రపంచదేశాల్లో భారతదేశం స్థానం, దౌత్యపరమైన పాత్ర శాంతి కోసం ఆశలు రేకెత్తించే ఒక ఆదర్శ వేదికగా మారింది. అయితే అధికారికంగా ఇంకా క్రెమ్లిన్ (రష్యా అధికార) వర్గాలు ఈ అంశాన్ని ధృవీకరించాల్సి ఉంది.
Comment List