తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు సీఎం గ్రీన్ సిగ్నల్..
వారానికి రెండుసార్లు అనుమతి..
లోకల్ గైడ్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించడం లేదనే విమర్శలు గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై సిఫారసు లేఖల అంశంపై సోమవారం చర్చించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సీఎం అంగీకరించారు. వారానికి రెండుసార్లు రూ.300 దర్శనానికి సంబంధించిన సిఫారసు లేఖలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. వాస్తవానికి తెలంగాణ నుంచి తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలకు తిరుమల తిరుపతి దేవస్థానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, గత కొద్దిరోజుల కిందట టీటీడీ ఈవో శ్యామల రావు శ్రీవారి దర్శనానికి ఏపీ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, విషయంలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ పాలకమండలి సమావేశంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై చర్చించారు. బోర్డు సభ్యులు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పాలకమండలి నిర్ణయం మేరకు బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖలకు సీఎం ఆమోదం తెలిపారు.
Comment List