నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార కమిషన్ .
చౌక ధర దుకాణాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల తనిఖీ.
ఆయా పథకాల అమలుపై లబ్ధిదారులతో ముఖాముఖి.
సంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్.
నల్లగొండ జిల్లా ప్రతినిధి.
లోకల్ గైడ్ :
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభ్యులు శారద, భారతి, జ్యోతిలు మంగళవారం నల్గొండ జిల్లా, గిరిజన ప్రాంతమైన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జాతీయ ఆహార భద్రత చట్టం- 2013 అమలు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషన్ ఒక చౌక ధర దుకాణాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ,హాస్టల్ ను తనిఖీ చేశారు.ఆయా ప్రభుత్వ సంస్థల తనిఖీ సందర్భంగా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల పౌష్టికాహారం విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల తనిఖీ సందర్భంగా విద్యార్థులకు విద్యతో పాటు, క్రీడలపట్ల శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు చెప్పారు. పాఠశాలల్లో పెరటి తోటలు పెంచాలని అన్నారు. ముందుగా కొండ మల్లేపల్లి పాల శీతలీకరణ కేంద్రంలోని విశ్రాంతి గృహం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా సీనియర్ అధికారులు కమిషన్ చైర్మన్, సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కమిషన్ మండల కేంద్రంలోని 3 వ నెంబర్ చౌకధర దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం, రేషన్ సరుకుల సరఫరా గురించి ఆరా తీశారు. స్టాక్ ఎంత ఉందని? రికార్డ్స్ నిర్వహిస్తున్నారా? తూకం ఎలా ఇస్తున్నారు ?సన్న బియ్యం లో నూకలు ఏమైనా వస్తున్నాయా? బియ్యం బాగానే ఉన్నాయా? లబ్ధిదారులు సన్న బియ్యం పట్ల ఎలా స్పందిస్తున్నారని? కమిషన్ సభ్యులు డీలర్ కిషోర్ ను ప్రశ్నించారు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే ఫిర్యాదు చేసేందుకు నోడల్ అధికారి ,ఇతర అధికారుల పేర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా ?ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారా ?అని అడిగారు. తన దుకాణానికి 196 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రతినెల కేటాయించడం జరుగుతుందని, అయితే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు వాటిని పంపిణీ చేసేందుకు కనీసం 15 రోజులు పట్టేదని, కానీ సన్న బియ్యం వచ్చిన తర్వాత కేవలం 4 రోజుల్లోనే బియ్యం మొత్తం పంపిణీ పూర్తయిందని, సన్న బియ్యం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఎలాంటి నూకలు రావట్లేదని, మంచిగానే వస్తున్నాయని బాగానే ఉందని తెలిపారు. అక్కడే ఉన్న సన్న బియ్యం లబ్ధిదారులు శ్రీనివాస్ తో కమిషన్ సభ్యులు ముఖాముఖి మాట్లాడారు. తాను ఈ నెల 24 కిలోల సన్న బియ్యం తీసుకున్నానని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, పాత బియ్యం లాగే సన్న బియ్యం ఉన్నాయని, ఇవే బియ్యం బయట 50 రూపాయలకు దొరుకుతున్నాయని, ఇలాంటి బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం పేదవాడికి చాలా సంతోషమని, బియ్యం పంపిణీ లో ఎలాంటి సమస్యలు లేదని ,డీలర్ సైతం ఎలాంటి ఇబ్బందులకు గురి చేయటం లేదని శ్రీనివాస్ కమిషన్ కు తెలియజేశారు . ఆ తర్వాత కమిషన్ కొండమల్లేపల్లి మండలం దోనియాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలతో ముఖాముఖి మాట్లాడారు. అంగన్వాడి కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారని ?గర్భినీ స్త్రీలు ఎంతమంది ఉన్నారని? ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం కోసం కేంద్రానికి వస్తున్నారా? ఎలాంటి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారని ?గుడ్డు సైజు బాగుందా? పౌష్టికాహారం ఇక్కడే తింటున్నారా లేక ఇంటికి తీసుకెళ్తున్నారా? పాలు, గుడ్లు, అన్ని సక్రమంగా ఇచ్చారా? లేక ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోజు ఇస్తున్నారా? అని అడిగారు. ,కాగా ఈ కేంద్రంలో 14 మంది పిల్లలకు మంగళవారం 10 మంది హాజరయ్యారని, 6 గురు గర్భిణీ స్త్రీలకు గాను, ముగ్గురు హాజరయ్యారని, పాలు, గుడ్లు, పండ్లు ఇక్కడే ఇవ్వడం జరుగుతుందని, ప్రతిరోజు వీటిని పంపిణీ చేస్తున్నామని నిర్వాహకురాలు బుచ్చమ్మ తెలుపగా.. గర్భిణీ స్త్రీలతో కమిషన్ సభ్యులు మాట్లాడి నిర్ధారణ చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు పాలు, కందిపప్పు, తనిఖీ చేశారు.
Comment List