డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
స్ఫూర్తిని కొనసాగిస్తాం.
పి.డి.ఎస్.యు పూర్వ విద్యార్థుల మార్నింగ్ వాక్.
లోకల్ గైడ్:
ప్రపంచం గర్వించదగిన మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి మరియు ఉస్మానియా అరుణతార పిడిఎస్ యు వ్యవస్థాపకుడు, యువ మేధావి కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పిడిఎస్ యు ప్రస్తుత, పూర్వ విద్యార్థులు ఎన్జీ కాలేజీ నుండి గడియారం సెంటర్ మీదుగా ఎన్జీ కాలేజీ వరకు మార్నింగ్ నిర్వహించారు. "జీనా హైతో మర్నాసికో - కదం కదం ఫర్ లడ్నా సికో" సేవ్ ఇండియా - సేవ్ కాన్స్టిట్యూషన్" నినాదాలతో ప్రదర్శన చేయడం జరిగింది.
ఈ మార్నింగ్ వాక్ లో పి డి ఎస్ యు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కే పర్వతాలు, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు జానకిరామ్ రెడ్డి, పూర్వ జిల్లా అధ్యక్షులు గుండె వెంకటేశ్వర్లు, పిడిఎస్ యు ప్రస్తుత జిల్లా కార్యదర్శి పోలే పవన్ పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డిలు దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. హిందూమతంలోని ఫాసిస్టు విధానాలను, మూఢనమ్మకాలను వ్యతిరేకించారనీ, తరతరాలుగా సాంప్రదాయాలు, కట్టుబాట్ల పేరిట దళిత, బహుజనులను విద్యకు దూరం చేసిన అగ్రకుల బ్రాహ్మణీయ సాంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. అంబేద్కర్ జార్జిరెడ్డిలు ఇద్దరూ కూడా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మానవీయ విలువల కోసం పోరాటాలు చేశారని అన్నారు. అనేక అవమానాలను ఎదుర్కొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని అట్టడుగు వర్గాల వెనుకబడిన దళిత, బహుజన అభివృద్ధి కోసం ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించాడని తెలిపారు. కామ్రేడ్ జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మనువాద శక్తుల అరాచక ఆధిపత్యాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల విద్యార్థులకు బిగిపిడికిలి జెండాను అందించాడని, జార్జి రెడ్డి ఇచ్చిన "జీనా హైతో మర్నాసికో- కదం కదం పర్ లడ్నాసికో" నినాదం యావత్ విద్యార్థి లోకాన్ని తట్టి లేపిందని, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాదులు వేసిందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల ప్రభావంతో, శ్రీకాకుళం, నక్సల్బరి, గోదావరి లోయ, ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో కామ్రేడ్ జార్జిరెడ్డి నాయకత్వాన 1972లో ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్ పురుడు పోసుకున్నదని తెలిపారు. పిడిఎస్ యు తెలుగు నేలపై అనేకమంది విప్లవ విద్యార్థి, యువ మేధావులను తయారు చేసిందని తెలిపారు. కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా, మతోన్మాద ఫాసిస్టు పరివారశక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల విద్యార్థి సంఘాన్ని స్థాపించాడని అన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి విద్యాసంస్థల్లో భూస్వామ్య హిందుత్వ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడని, జార్జిరెడ్డిని ఏ విషయంలోనూ ఎదుర్కోలేని ఏబీవీపీ మతోన్మాద కిరాయి గుండాలు అంబేద్కర్ జయంతి రోజే ఉస్మానియా విశ్వవిద్యాలయం లో అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి 1972లో ఏప్రిల్ 14న హత్య చేసి వికృతానందం పొందారని అన్నారు. జార్జి మిత్రులు పిడిఎస్ సంస్థను తెలుగు నేలంతా విస్తరింపజేసి అన్ని విద్యాలయాలను విప్లవ ప్రాంగణాలుగా మార్చి పిడిఎస్ యు విప్లవ విద్యార్థి చరిత్రను మరింత ఎరుపెక్కించారని కొనియాడారు. జార్జి రెడ్డి అందించిన స్ఫూర్తితో జంపాల, శ్రీపాద శ్రీహరి, చేరాలు, వరహాలు, సాంబయ్య, మధుసూదన్ రాజ్, మారోజు వీరన్న, రంగవల్లి లాంటి ఎందరో మెరికల్లాంటి విద్యార్థి నాయకులు ప్రజా ఉద్యమంలోకి అడుగు పెట్టారని అన్నారు.
నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యను పూర్తిగా కాషాయికరించిందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ప్రజా హక్కులను, చట్టాలను ఖూనీ చేసిందని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వరంగ సంస్థలను, బహుళ జాతి, కార్పోరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టిందని అన్నారు. దేశభక్తి, హిందుత్వం ముసుగులో దేశ వనరులను, సహజ సంపదలను దళారులకు అమ్మి వేస్తుందని తెలిపారు. తాజాగా మోడీ ప్రభుత్వం కన్ను అడవులపై పడిందని, 2026 మార్చి 31 నాటికి అడవులను అదాని కి అప్పగించడం కోసం అత్యంత క్రూరంగా ఆపరేషన్ కగారు పేరుతో అడవిలో ఉన్న ఆదివాసీలను హాననం చేస్తుందని దుయ్యబట్టారు. లక్షల కోట్ల రూపాయలు కార్పోరేట్ సంస్థలకు రాయితీ ఇస్తూ, దేశ ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతున్నదని అన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, ప్రాచీన భారత రాజ్యాంగం పేరుతో మనుస్ృతిని తిరిగి తెరపై తీసుకురావడానికి, భారత రాజ్యాంగాన్ని బలహీన పరుస్తున్నదని తెలిపారు. ఈ విధానాలపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జార్జ్ రెడ్డి లు అందించిన స్ఫూర్తితో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ముక్తకంఠంతో నిరసించాలని, అగ్రకుల బ్రాహ్మణీయ, ఫాసిస్టు, మతోన్మాద విధానాల పట్ల ప్రజలు అప్రమత్తమై బిజెపి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పిడిఎస్ యు ప్రస్తుత, పూర్వ విద్యార్థి నాయకులు ఇందూరు సాగర్, సిహెచ్ గురూజీ, రవీందర్ రెడ్డి, పందుల సైదులు, ఊదరి వెంకటేశ్వర్లు, వైద్యుల సత్యనారాయణ, బీవీ చారి, బొంగరాల నరసింహ, కే అనంతరెడ్డి, గద్దపాటి సురేందర్, సిహెచ్ సుధాకర్ రెడ్డి, పి వెంకులు, తోట నరసింహ చారి, ఏడుకొండలు, దుర్గయ్య, గూడూరు సునీత, సింధు, గంగ, వెంకట్ రెడ్డి, కట్టు వెంకటరెడ్డి, ప్రభాకర్, మొండి శేఖర్, సైదులు, లింగస్వామి, శేఖర్ రెడ్డి, దశరథ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
Comment List