విద్యార్ధులు ఒత్తిడిని తట్టుకుంటూ పరీక్షల భయాన్ని జయించాలి..
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది....
పదవ తరగతి ఫలితాలు భవిష్యత్ లక్ష్యాలకు మార్గదర్శకాలు.
పదవ తరగతి పరీక్షలకు సులువైన పద్దతులపై విద్యార్థులకు అవగాహన కలిపించిన కలెక్టర్
లోకల్ గైడ్, ఖమ్మం
పదో తరగతి పరీక్ష ఫలితాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు అని, ఉన్నత విద్య లక్ష్య సాధనకు దిక్సూచిగా నిలుస్తాయాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.స్థానిక పాండురంగాపురం లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల కు అందిస్తున్న భోజనం, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, స్కూల్ పరిసరాలను పరిశీలించారు. కొనసాగుతున్న పదవ తరగతి గదులను సందర్శించారు. కలెక్టర్ టీచర్ గా పలు అంశాలపై విద్యార్థులకు విద్యాబోధన చేశారు. జువాలజీ పాఠ్యాంశాల పై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. అనంతరం కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు. విద్యార్థులతో మమేకమై ఎలా చదువుతున్నారు? టీచర్లు పాఠాలు ఎలా చెపుతున్నారు? పాఠ్యాంశాల బోధన పట్ల అవగాహన కలుగుతుందా? మీరు ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటి? అని తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన విద్యా విధానం, విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి ప్రణాళిక, పరీక్షల సమయంలో ధైర్యంగా, ఒత్తిడి లేకుండా ఉండే పలు విషయాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉండాలని, దాని సాధన దిశగా కృషి చేయాలని, మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ప్రణాళిక తయారు చేసుకొని క్రమ పద్ధతిన ఆ దిశగా పయనించాలని సూచించారు.పదవ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తు యొక్క లక్ష్యాలు సాధించడానికి మార్గదర్శకంగా ఉంటాయన్నారు. పదవ తరగతి ఫలితాల్లో ఎన్ని మార్కులు వస్తాయి అని విద్యార్థులు ఆలోచించకుండా వారి భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవాలని అన్నారు. పదవ తరగతి తర్వాత అనేక ఉన్నత కోర్సులు చేయాలని సూచించారు. నిరంతరం కష్టపడుతూ ఉంటే భవిష్యత్తు మార్గాలు చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులు ఒక మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు అన్ని రకాల పుస్తకాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పరీక్షలకు 10 రోజులే సమయం ఉన్నందున కాలాన్ని వృధా చేయవద్దన్నారు. విద్యార్థులు సమన్వయంతో చదువుకోవాలని, వెనుకబడిన విద్యార్థులుకు సహకారం అందించాలన్నారు. జిల్లాలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అన్నారు.ఆనతరం కలెక్టర్, స్కూల్ టీచర్ల లకు విద్యా బోధన, పరీక్షల పట్ల పలు సూచనలు చేశారు. విద్యార్ధుల పట్ల ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు మరింత బాధ్యత ఉంటుందని, బడుగు, బలహీన వర్గాల పిల్లలు అధికంగా మన పాఠశాలలో చదువుతారని, వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, జీవితంలో పెద్ద స్థాయికి చేరేలా చూడాలని, పిల్లలు మంచి ఆశయాలు పెట్టుకునేలా మన ఉపాధ్యాయులే నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండాలని తెలిపారు. విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశాం అనేది కీలకమని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈవో సోమశేఖరశర్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comment List