ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది: కిషన్ రెడ్డి
లోకల్ గైడ్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. అధికారంలో ఉండి కూడా మూడు స్థానంలో పోటీ చేసే ధైర్యం చేయలేదు.అందుకే ఒక్క స్థానంలోనే పోటీ చేస్తోంది. ఆ స్థానంలో కూడా బీజేపీయే గెలిచే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన,బీజేపీ పోటీ చేస్తున్న మూడు స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తిడితే ఇవాళ ఏదో ఆదరాబాదరాగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కూడా ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు తలా తోక లేకుండా మాట్లాడుతూ.. ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎన్నికలు జరగక ముందే ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహతో మాట్లాడుతున్నారు.14 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసింది. పదేళ్లు బీఆర్ఎస్ పట్టి పీడిస్తే.. 14 నెలల్లోనే కాంగ్రెస్ అదే స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను పట్టిపీడించింది. జెండాలు మాత్రమే మారాయి.. ప్రజల జీవితాలు మారలేదు. ముస్లింలను బీసీల్లో కలపాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్క పార్టీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాం. కేసీఆర్ నుంచి అబద్ధాలు మాట్లాడటం సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకున్నట్టున్నారు. అందుకే రాష్ర్టానికి ఏం చేయకపోయినా ఏదో చేసినట్టు అర చేతిలో వైకుంఠం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని, సమగ్రమైన దర్యాప్తు జరపాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. అధికారంలోకి రాకముందు సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పడు అధికారంలోకి వచ్చి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టినా.. బీజేపీ వదిలే ప్రసక్తే లేదు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు కూలగొట్టకుండా ప్రక్షాళన చేసి, నల్లగొండ రైతులకు మంచి నీరివ్వాలని కోరుతున్నాం.మజ్లిస్ పార్టీతో, బీఆర్ఎస్ తో, కమ్యూనిస్టు పార్టీలతో చీకటి ఒప్పందాలు చేసుకునే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకే ఉంది.రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. మాకు నైతిక విలువలు ఉన్నాయి కాబట్టే ఎన్నో ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్నాం. అధికారం కోసమో, పదవుల కోసమో బీజేపీలో చేరలేదు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలో పనిచేశాం.పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా నైతికత గురించి, నా నిజాయతీ గురించి మాట్లాడే హక్కు లేదు. గ్రామాల్లో ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పటికిప్పుడు ఏ రాష్ర్టంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుంది. మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, రైతు భరోసా ఏది? రైతులు పండించిన పంటలకు బోనస్ ఎక్కడ? ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల భూమి, అమరవీరుల కుటుంబానికి రూ.25 వేలు, చేయూత కింద రూ.4 వేల పెన్షన్ ఎవరు ఇచ్చారు? ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వైద్య బీమా అమలు చేయకుండా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం ఎందుకు తీసుకురాలేదు? ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు?ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో చెప్పాలి.సాధారణ ఎన్నికలకు, పట్టభద్రుల ఎన్నికలు, ఉపాధ్యాయుల ఎన్నికలకు మధ్య తేడా కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా మాట్లాడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారికి బెనెఫిట్స్, జీపీఎఫ్ నిధులు కూడా ఇవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటు.రూ.8,500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో రీయింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీలు, స్కూళ్లు మూత పడుతున్నాయి.317జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలు ఇంకా తీరలేదు. ఏ ఒక్క సారైనా బీసీ ముఖ్యమంత్రిని చేసిందా? బీసీ ప్రధానమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయా? బీసీని ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీజేపీది. పదేళ్లుగా నరేంద్రమోదీ హయాంలో సుపరిపాలన అందిస్తున్నాం. కాంగ్రెస్ పరిపాలనకు, బీజేపీ పరిపాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. మేం దేశం కోసం పనిచేసే వ్యక్తులం. టెక్స్ టైల్ పార్క్ , రీజినల్ రింగ్ రోడ్డు, ఇండస్ర్టియల్ పార్కు, హైదరాబాద్ అభివృద్ధిపై అధికారులతో సమావేశమై స్వయంగా సమీక్షించి, అంకిత భావంతో మేం పనిచేశాం. అలాంటి మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
Comment List