భూ భారతిలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
నాలుగు గోడల మధ్య స్వార్ధ పూరితంగా తెచ్చిన చట్టం కాదు
భూ భారతి రైతులకు శ్రీరామరక్ష
* తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* అశ్వారావు పేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో భూ భారతి చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు
లోకల్ గైడ్:
భూ భారతి చట్టంలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని... ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని.... రైతులకు భూ భారతి చట్టం శ్రీరామ రక్ష అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భూ భారతి - 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ చట్టం చేసేముందు రైతుల కష్టం గురించి ఆలోచించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని రైతులకు శ్రీరామరక్షలా నిలిచే విధంగా భూభారతి -2025 చట్టాన్ని రూపొందించామని తెలిపారు. గతంలో నాలుగు గోడల మధ్య స్వార్ధపూరితంగా తయారుచేసిన ధరణి చట్టానికి మూడేళ్లు గడిచినా నియమనిబంధనలు రూపొందించలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాల్లో తొలివిడత ప్రయోగాత్మకంగా అమలు చేసి అన్ని వివరాలు, దరఖాస్తులు సేకరిస్తున్నామని, జూన్ 2 నాటికి వీలైనన్ని సమస్యలు పరిష్కరించి , అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పట్టాలుగా అందజేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వివరించారు. భూ యజమానులకు న్యాయం జరిగేలా తహశీల్దార్ మొదలు కొని సీసీఎల్ఎ వరకు ఐదంచెల వ్యవస్దను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సీసీఎల్ఎ వద్ద కూడా న్యాయం జరగలేదని భావిస్తే ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అవసరమైనన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేనెల 10వ తేదీకల్లా రెవెన్యూ ,గ్రామ పరిపాలనాధికారులు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తప్పుచేసే అధికారులపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. గతంలో రైతు బంధు కోసం గులాబీ రంగు కార్యకర్తలకు భూమి లేకపోయినా పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని, సక్రమంకాని అటువంటి అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు మరిన్ని సేవలు అందేలా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందని ఏ పార్టీ కార్యకర్త అనే పక్షపాతం లేకుండా ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు చట్టం ఒక చుట్టంలా ఉపయోగపడేలా చూస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comment List