రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి కొండా సురేఖ
లోకల్ గైడ్ తెలంగాణ:
సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వరంగల్ పట్టణంలోని కాశిబుగ్గ జంక్షన్ వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ లతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడతూ సమానత్వానికి శిల్పి,రాజ్యాంగానికి నేత, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆయన ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమేనని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారధ్యంలోరాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని అన్నారు. పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తిశిఖరం, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. నేటి తరానికి ఆ మహనీయుని సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామన్నారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని మంత్రి పిలుపునిచ్చారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ భారతీయ సమాజానికి అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేడ్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారుఅసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తి దాయకమని, నేటి యువత ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List