గడ్డకట్టిన దాల్ సరస్సు
చలి గుప్పిట్లో అందాల కశ్మీర్.. భారీగా పతనమైన ఉష్ణోగ్రతలు..
లోకల్ గైడ్: భూతల స్వర్గం జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కశ్మీర్ వ్యాలీలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 7 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అందాల శ్రీనగర్ (Srinagar)లో ఉష్ణోగ్రతలు మైనస్ 4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ మేర స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. డిసెంబర్ 26 వరకు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఏకాంత ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.ఐఎండీ డేటా ప్రకారం.. షోపియాన్‌లో మైనస్ 10.4 డిగ్రీల సెల్సియస్, పుల్వామాలో మైనస్ 10.3 డిగ్రీల సెల్సియస్, లార్నూలో మైనస్ 9.3 డిగ్రీల సెల్సియస్, ఖుద్వానీలో మైనస్ 9.0 డిగ్రీల సెల్సియస్, సోనామార్గ్‌లో మైనస్ 8.8 డిగ్రీల సెల్సియస్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పహల్గామ్‌లో కనిష్టంగా మైనస్ 8.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుద్గాం, ఖాజిగుండ్‌లో వరుసగా మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్, మైనస్ 8.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కశ్మీర్ వ్యాలీ (Kashmir Valley) అంతటా చలి తీవ్రత పెరిగింది. అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు నీరు గడ్డకట్టింది. ఈ చలికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.
Comment List