కళ్యాణ రాముడు ...!   

కళ్యాణ రాముడు ...!   

  • రమణీయం రాములోరి కళ్యాణం 
    - భద్రాద్రి కి పోటెత్తిన భక్తజనం  
    - మురిసి మెరిసిన మిధిలా ప్రాంగణం 
    - వేడుకకు సతీ సమేతంగా  హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
    - డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు కూడా  
    -  శ్రీరామ పట్టాభిషేకం
  • ఖమ్మం- (లోకల్ గైడ్)

ఆకాశమంత పందిరి...! భూదేవంత మండపం...!
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి...!మణి బాసికమును నుదుటున కట్టిన పెళ్లికూతురు  సీతమ్మవారు...!
సంపంగి నూనెను కురులను దువ్వి...!
సొంపుగా కస్తూరి నామము తీర్చిన ...! పెళ్ళికొడుకు రాములోరు...! ఎదురెదురు కూర్చుండగా ...!

అర్చక స్వాముల వేద పరిమళాలతో సాగిన శ్రీ సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం...!
కళ్యాణ క్రతువు  నయనానందకరం...!
ఆధ్యాంతం ముగ్ధ మనోహరం...!
భక్తుల శ్రీరామ నామస్మరణలతో మిధిలా ప్రాంగణం మురిసి మెరిసింది...!
వేద భూమి భద్రగిరి పరవశించింది...! 
అశేష భక్తజనంతో పుణ్య నేల పులకరించింది...!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన అశేష భక్తజనంతో భద్రాచలం పోటెత్తింది.     


రమణీయం రాములోరి కళ్యాణం.. 

వేద భూమి భద్రాచలం పుణ్యక్షేత్రంలో మిధుల ప్రాంగణంలో ఆదివారం జరిగిన శ్రీ సీతారాముల వారి తిరు కళ్యాణ మహోత్సవ వేడుక ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. తరతరాలుగా ప్రతి ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న విషయం విధితమే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి  తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా తొలుత ఉదయం రామాలయంలోని గర్భగుడిలో ధ్రువమూర్తులకు అర్చక స్వాములు కళ్యాణం జరిపారు. తదుపరి భాజా భజంత్రీల సవ్వడి, సన్నాయి మేళాల సందడి, భక్తుల జయ జయ ద్వానాల నడుమ శ్రీ సీతారామచంద్రస్వామి వారిని పల్లకిపై ఊరేగింపుగా మిధుల మండపం వద్దకు తీసుకువచ్చారు. సీతమ్మవారిని, రాములవారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి అర్చక స్వాములు కళ్యాణ తంతును ప్రారంభించారు. తిరు కళ్యాణము కు సంకల్పం చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం గావించారు. దర్భ తాడును సీతమ్మ వారి నడుముకు బిగించారు. రాములోరి కుడి చేతికి, సీతమ్మ వారి ఎడమ చేతికి రక్ష సూత్రాలు తొడిగారు. సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింప చేశారు.ప్రవరణ, మోక్ష బంధన, యజ్ఞోపవేతం, వరపూజ, మధుపర్కం సూత్రం తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ భక్త రామదాసు వారు చేపించిన పచ్చల పతకం రాములోరికి, చింతాకు పతకం సీతమ్మవారికి, శ్రీరామ మాడ లక్ష్మణ స్వామి వారికి అలంకరింప చేశారు. కచ్చితంగా 12 గంటలకు పుణ్య ముహూర్తం అభిజిత్ లగ్నం సమీపించగానే వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. జనక మహారాజు, దశరథ మహారాజు తరపున చేయించిన రెండు మంగళసూత్రాలతో పాటు, శ్రీ భక్త రామదాసు వారు సీతమ్మవారికి చేయించిన మరొక సూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగల్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు సాంప్రదాయ బద్దంగా జరిపారు. తదుపరి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం బంతులాట, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు జరిపారు. అష్టోత్తర హారతితో కళ్యాణ తంతును అర్చక స్వాములు ముగించారు. కళ్యాణం ఆధ్యాంతం అర్చక స్వాములు వేదమంత్రాలు గావించారు. కళ్యాణ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకిస్తూ తన్మయానికి లోనయ్యారు. శ్రీరామ జయరామ అంటూ జయ జయ ధ్వనాలు చేశారు.              


 ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి 'రేవంత్ రెడ్డి' దంపతులు 

భద్రాచలంలో సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు శ్రీ సీతారాముల వారి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకకు హాజరయ్యారు. తొలుత రామాలయం సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మిదులా ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సమర్పించారు.శ్రీ స్వామివారి కల్యాణంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ పౌర సమాచార  శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కూనమనేని సాంబశివరావు, కోరం కనకయ్య,రాందాస్ నాయక్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు


 భద్రాద్రికి పోటెత్తిన భక్తులు  : 

భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకకు దేశ నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సమీప ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలం తరలివచ్చారు. భక్తుల రాక కనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జిల్లా కలెక్టర్ జీతీష్ వి.పాటిల్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, అర్చక స్వాములు వేద పండితుల సహకారంతో వైదిక క్రతువును విజయవంతంగా జరిపారు.  మిధులా ప్రాంగణంలో జరిగిన కళ్యాణ వేడుకకు భక్తులు భారీగా హాజరయ్యారు. భద్రాద్రి రామున్ని బారులు తీరి మరి భక్తులు దర్శించుకున్నారు. స్థానికులు భక్తులకు అన్నదానం, పానకం, ఇతర ఆహార పదార్థాలు అందజేస్తూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు


 శ్రీరామ పట్టాభిషేకంకు ఏర్పాట్లు  : 

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం మిధిలా ప్రాంగణంలో శ్రీరామ పట్టాభిషేకం వేడుక జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అధికారులు హై అలర్ట్ అయ్యారు. శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు కూడా భక్తులు వేలాది సంఖ్యలో హాజరుకానున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈ వేడుకకు సంబంధించి వైదిక పరమైన ఏర్పాట్లను చేసింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News