నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- తను నటనతో అప్పటి ప్రేక్షకులను అలాగే ఇప్పటి ప్రేక్షకులను అలరించే మోహన్ బాబు... తాజాగా తన లైఫ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు తన బాల్యం అలాగే కెరీర్ గురించి వివరించాడు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పుకున్నారు. ఎవరికీ చెప్పకుండా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి రాజమకుటం సినిమా చూశానని అన్నారు. 1975లో స్వర్గం - నరకం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా అందరికీ పరిచయమయ్యానని అన్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ అన్నతో మేజర్ చంద్రకాంత్ అనే సినిమాకు నా ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి మరి సినిమా తీశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఇంత సాహసం చేయొద్దు అని సీనియర్ ఎన్టీఆర్ అన్నారని చెప్పుకొచ్చారు. కానీ సినిమా కథపై నమ్మకంతో చాలా మొండిగా ఆ సినిమాను తీశానని... చాలా బాగా ఆ సినిమా సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అప్పట్లోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చాలామంది కోరారని.. కానీ అప్పటికే నా జీవితంలో మొత్తం కూడా చూసేశానని ... రాజకీయాలు నాకు సెట్ కావు అని అనిపించిందని అన్నారు. దాదాపు 560 సినిమాలకు పైగా చేశాను అని... ఇప్పుడు నా పిల్లలు కూడా సినిమాలలో నటిస్తున్నారని... ఇంతకన్నా పెద్ద అదృష్టం ఇంకేము ఉంటుందని అన్నారు. నాకు నిజంగానే కోపం ఎక్కువ అని, నా జీవితంలో నన్ను ఎంతోమంది మోసం చేశారని... అందుకే ఆవేశం కూడా ఎక్కువే అని, కానీ ఆవేశం నాకు నష్టాన్ని కలిగించిందని అన్నారు. ఇప్పటికీ నాపై చాలామంది ట్రోలింగ్ చేస్తారు కానీ ఆ ట్రోలింగ్‌ను నేను అసలు పట్టించుకోనని మోహన్ బాబు అన్నారు.
Comment List