ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించే హక్కు, నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు: మంత్రి జూపల్లి
-కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్ట్ లను గత బీఆర్ఎస్ పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేశారు
-దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లు దశాబ్దకాలంగా గత ప్రభుత్వంలో వివక్షకు గురయ్యాయి
-బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు
-గత ప్రభుత్వ తప్పిదాలకు మాపై అభాంఢాలు వేయడం సరికాదు
-బీఆర్ఎస్ హాయంలోనే ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు
-సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాం
లోకల్ గైడ్,వనపర్తి: కృష్ణ బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్ట్ లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మెఘారెడ్డి, ఎంపీ మల్లురవితో కలిసి మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. దక్షిణ తెలంగాణ వరప్రదాయిని లాంటి పాలమూరు- రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్ట్ లను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కృష్ణ బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదని, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంత ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా పనులను పెండింగ్ పెట్టారని ద్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్ధ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లు కొల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మంజూరైన ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసిన మాటా వాస్తవం కాదా? ,ఈ ప్రాంత ప్రాజెక్ట్ లను పూర్తి చేయకుండా.. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు ఎక్కడ పేరొస్తుందని పెండింగ్ లో పెట్టారా? అని అన్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించే హక్కు, మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. బీఆర్ఎస్ తొమిదన్నర ఏళ్ల తమ పాలనలో ఎందుకు ఎల్ఎల్బీసీ పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీని సందర్శించే నైతిక హక్కు హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. అప్పుడే మీరు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నామని, 11 సంస్థలకు చెందిన వివిధ రంగాల నిపుణుల పర్యవేక్షణలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇవాళ లేదా రేపటిలోగా సహాయక చర్యలు పూర్తి అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించలేదని బీఆర్ఎస్ నేతలు చిలుక పలుకులు వల్లిస్తున్నారని, గతంలో కొండగట్టు బస్సు ప్రమాదం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ప్రమాదం, శ్రీశైలం పవర్ హౌజ్ లో ప్రమాదాలు జరిగినప్పుడు కేసీఆర్ కనీసం బయటకు రాలేదని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ వయబుల్ కాదని, ఆర్థిక ప్రయోజనాలు నెరవేరవని గతంలో కేసీఆర్ మాట్లాడారని, కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నిర్వహణ, విద్యుత్ వినియోగానికి వేల కోట్ల రూపాయాలు ఖర్చవుతున్నాయని, దాంతో పొల్చుకుంటే ఎస్ఎల్బీసీ రూ. 4 వేల కోట్ల వ్యయంతో 20 టీఎంసీల నీటిని వాడుకుని 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని, నీటిని పంపింగ్ చేయాల్సిన అవసరం లేదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని, శవ రాజకీయాలు చేయొద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.
Comment List