భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం భూ భారతి చట్టం
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
లోకల్ గైడ్: భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారంగా భూ భారతి చట్టం అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. సోమవారం వడ్డేపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ధరణి చట్టంలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతి రైతుకు ఆధార్ కార్డు వంటి భూదార్ కార్డు ఇవ్వనుందని, దీనివల్ల భూములకు సంబంధించిన అన్ని రికార్డులు సులభంగా పొందగలుగుతారని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదా బైనామాల సమస్యలు, సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ వంటి అంశాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతుల సర్వే సమస్యలను పరిష్కరించేందుకు లైసెన్సడ్ సర్వేయర్లను నియమించ నుందని, దీనిద్వారా భూములకు సంబంధించిన వివాదాలను సర్వే చేసి, మ్యాపులతో పట్టా పాస్ పుస్తకంలో చేర్చుకోవడానికి అవకాశ ముందని తెలిపారు. రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్, మ్యుటేషన్, ల్యాండ్ ఎక్స్చేంజ్, వారసత్వం వంటి చిన్న సమస్యలు తహసీల్దార్ స్థాయిలో పూర్తవుతాయని తెలిపారు. ఓ.ఆర్.సి, ఇనామ్, అసైన్మెంట్, సీలింగ్ ల్యాండ్, లోక్ అదాలత్ తదితర భూ సమస్యలు ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించ బడతాయని తెలిపారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలలో అప్పీల్ చేసే అవకాశం అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడానికి, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించనుందని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని, నిర్దేశిత సమయంలో ప్రజలకు సేవలు అందించేందుకు చట్టంలో అధికారులపై బాధ్యత పెట్టడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల దరఖాస్తులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు భూ భారతి చట్టం ద్వారా లభించే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం పలువురు రైతులు అడిగిన సందేహాలను, అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, తహసిల్దార్ వీరభద్రప్ప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనువాసులు, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడప్ప, వడ్డేపల్లి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజప్ప, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comment List