భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.
లోకల్ గైడ్ :
భూభారతి చట్టం ద్వారా వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాలులో భూభారతి చట్టం -రైతుల చుట్టం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అవగాహన సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లోని రైతులు ప్రజలకు చట్టంలోని అంశాలను తెలియజేయాలన్నారు. చాలావరకు పొజిషన్, విస్తీర్ణం, ఇలాంటి భూ సమస్యలను పరిష్కరించుకునేం దుకు సర్వే స్కెచ్ అంశం కొత్త చట్టంలో ఉందన్నారు. భూ సమస్యలు, రికార్డుల్లో తప్పులను తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల్లో సవరించుకునే అవకాశాన్ని భూభారతి చట్టం కల్పించిందన్నారు. సాదా బైనామా దరఖాస్తులపై ఆర్డిఓ విచారించి, పంచనామా చేసిన అనంతరం పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విరాసత్ అనేది 30 రోజుల్లో తహసిల్దార్ చేయాలని చట్టంలో ఉందన్నారు. భూములకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసిల్దార్ ఇచ్చిన ఆర్డర్ పై ఆర్డీవో, కలెక్టర్, సిసిఎల్ఏ స్థాయిల్లో తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. పది రోజుల్లో ప్రారంభం కానున్న భూభారతి చట్టం ఆన్లైన్ పోర్టల్ లో తమ భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను విచారించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ అవగాహన సదస్సులో ముందుగా భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. చట్టంలోని మార్గదర్శకాలను ఆర్డీవో రాథోడ్ రమేష్ రైతులు ప్రజలకు చదివి వినిపించారు. భూభారతి చట్టంలోని అంశాలను ముద్రించిన కరపత్రాలను రైతులు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా తమ భూ సమస్యలను మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రజలు కలెక్టర్,అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఝాన్సీ , తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో బాబు, పీఏ సీఎస్ ఛైర్మన్ సంపత్ రావు, పలువురు అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
Comment List