రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం
మణిపూర్ అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన అవకతవకలపై విచారణకు డిమాండ్
లోకల్ గైడ్ :
మణిపూర్ అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు రాజ్ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది.
అదానీ వ్యవహారంతో పాటు మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు దేశ పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇచ్చినట్లు అక్కడి దర్యాప్తు సంస్థలు గుర్తించాయన్నారు. ఇది మనదేశ గౌరవానికి భంగం కలిగించడమేనన్నారు. అదానీపై విచారణ జరగాలని, జేపీసీలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారన్నారు. అయినా కేంద్రం స్పందించడం లేదని, అందుకే రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాజ్ భవన్‌ల ముట్టడి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించిందన్నారు. అదానీపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని, అదానీ అవినీతిపై చర్చించేందుకు జేపీసీ వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అదానీతో ప్రధాని మోదీకి లాలూచీ ఒప్పందం ఉందని, అదానీని కాపాడేందుకు ప్రధాని యత్నిస్తున్నారన్నారు. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు. జేపీసీ వేస్తే అదానీ జైలుకు వెళ్తారని సీఎం అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మోదీ, అదానీ ఏక్ హై అంటూ నినాదాలు చేశారు.
ఇక, అదానీ అంశంపై కేసీఆర్ విధానం ఏంటి అని, అదానీని శిక్షించాలా.. వద్దా అనేది కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రధాని మోదీతో బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం ఉందని, అరెస్టుల నుంచి కాపాడుకోవడం కోసమే మోదీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజల వైపా లేదా అదానీ, ప్రధాని వైపా చెప్పాలన్నారు.
అదానీపై మాట్లాడితే మోదీ జైల్లో పెడతారని బీఆర్ఎస్‌కు భయం ఉందన్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, కేసీఆర్ నాణానికి బొమ్మ, బొరుసులాంటివారని రేవంత్ అన్నారు. ఒకరు తప్పు చేస్తారని, మరొకరు తప్పు నుంచి రక్షిస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అదానీ అంశంపై చర్చకు సిద్ధం ఉన్నామని ప్రకటించారు. అదానీపై జేపీసీ వేయాలని ఏకగీవ్ర తీర్మానం పంపుదామని, దీనిపై బీఆర్ఎస్ నేతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.
Comment List