పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
లోకల్ గైడ్:
జిల్లా లో గల సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రయోగశాలలో విద్యార్థులకు ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, మానవ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించి పరిజ్ఞానం పెంపొందించేలా వివిధ రకాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన నమూనాల వల్ల ఆచరణాత్మక విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులకు అన్ని అంశాలు సులువుగా అర్థమవుతాయని తెలిపారు. ఈ ప్రయోగశాలను ఉపయోగించి పాఠశాలలోని విద్యార్థులందరికీ నైపుణ్యాలు పెంపొందించేలా ఆచారనాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని ఏ ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఇటువంటి ప్రయోగశాల లేదని అన్నారు. ఇటువంటి సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల్లో పఠనాసక్తి, నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు.కాగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో సుమారు 19 లక్షల 50 వేల రూపాయల ఖర్చుతో మొదటగా జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నిర్మల్ రూరల్ మండలం అనంత పేట్ కేజీబీవీ, మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ పాఠశాల, తాండూరు మండలం బోసి ప్రభుత్వ పాఠశాల లో ఒక్కో పాఠశాలకు సుమారు 5 లక్షల చొప్పున వ్యయంతో ఈ ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డీఈఓ పి. రామారావు, సెక్టోరల్ అధికారి రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి వినోద్, తహసిల్దార్ మల్లేష్, ఎంఈఓ పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయురాలు ఆరాధన, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List