సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
గద్వాల (లోకల్ గైడ్ ) : మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ.వెంకటస్వామి, వివి నరసింహ, జి. రాజు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ సమ్మెకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలకు సవరణలు చేస్తూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఉపాధి హామీని దూరం చేస్తూ రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కార్మికులు, కర్షకులు, ఉపాధి కూలీలు మే 20న పని బంద్ చేసి సార్వత్రిక సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జయన్న పాల్గొన్నారు.
Comment List