ఈనెల 22 నుండి 30వ తేదీ వరకు ఇందిరమ్మ ఇండ్లకు వెరిఫికేషన్ పూర్తి చేయాలి
•మే రెండో తేదీన అర్హుల జాబితా ప్రదర్శన.
--హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.
హనుమకొండ, (లోకల్ గైడ్): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు వెరిఫికేషన్ అధికారులు ఈనెల 22 నుండి 30వ తేదీ వరకు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు నియమితులైన మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వెరిఫికేషన్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి మండలంలో నలుగురు అధికారులను వెరిఫికేషన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటివరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులతోపాటు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారని, ఇప్పుడు మండల స్థాయిలో వెరిఫికేషన్ ఆఫీసర్లు పరిశీలిస్తారని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన వివరాలు రాష్ట్రస్థాయిలో పరిశీలనలో ఉన్నాయన్నారు. మూడు కేటగిరీల లిస్టులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు అర్హుల జాబితాను పరిశీలిస్తారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి ఎంపిక చేసే లబ్ధిదారులలో మహిళలు పేర్లను మాత్రమే అర్హులు జాబితాలో పెట్టాలని, వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని, దీనిపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా రాలేదన్నారు. లబ్ధిదారులు బీపీఎల్ అయి ఉంటే చాలునని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో వెరిఫికేషన్ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. వెరిఫికేషన్ అధికారులు వెరిఫికేషన్ లిస్టు లో ఉన్న వాటి వివరాలను నమోదు చేయాలన్నారు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే రిమార్క్స్ కాలమ్ లో నమోదు చేయాలన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలన్నారు. వెరిఫికేషన్ అధికారులు ఏవైన సందేహాలు ఉన్నట్లయితే ఎంపీడీవో, హౌసింగ్ పీడీల ద్వారా అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్ కోసం క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వారిని కూడా అర్హులా కాదా అనేది విచారించాలని, వివరాలు అన్నీ కూడా సరిగా నమోదు చేయాలన్నారు. వెరిఫికేషన్ లో ఎలాంటి తప్పులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు ప్రభుత్వ మార్గ నిర్దేశాల ప్రకారం నిబద్ధతతో చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి అర్హులైన అత్యంత నిరుపేదలు, అసలు ఇల్లు లేని వారిని ఎంపిక చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో వెరిఫికేషన్ అధికారులకు పంచాయతీ కార్యదర్శుల సహకారం అందిస్తున్నట్లుగానే అర్బన్ ప్రాంతంలో వెరిఫికేషన్ అధికారులకు వార్డ్ ఆఫీసర్లు తోడ్పాటు అందించాలన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం మే రెండవ తేదీన అర్హుల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ వార్డులలో ప్రదర్శించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి అత్యంత నిరుపేదలను మొదటి దశలో ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి లబ్ధిదారు ఎంపిక ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్ ను సంబంధిత అధికారులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
హనుమకొండ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అన్నారు. వచ్చిన దరఖాస్తులను మూడు కీటగిరిలు (లిస్టు లు)గా విభజించడం జరిగిందన్నారు. ఇందులో ఎల్-1 కేటగిరిలో ఇంటి స్థలం ఉన్న వారిని, ఎల్-2 కేటగిరిలో ఇంటి స్థలం, ఇల్లు లేని వారు, ఎల్-3 కేటగిరిలో అర్హతలు లేని వారి గా విభజించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారుల అర్హతలు పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లు పథకానికి తుది జాబితాను ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గోడిశాల రవీందర్ మున్సిపల్ పరిధిలోని డివిజన్ల వెరిఫికేషన్ గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, గృహ నిర్మాణ శాఖ డిఈ సిద్ధార్థ నాయక్, జిల్లాలోని ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దారులు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comment List