ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి.

లోకల్ గైడ్ :
జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం ప్రాంతంలో పర్యాటకులపై దాడి చేసి 27 మందిని చంపిన ఉగ్రవాదుల చర్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, దేశ ప్రజానీకం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ లోని పహాల్గాం పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లిన 27 మంది పర్యాటకులను విచక్షణరహితంగా దాడి చేసి తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాదుల చర్యలను దేశ ప్రజానీకం ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఈ దాడిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగి వసుదైక కుటుంబ భావన కలిగిన భారత దేశంలో ఇటువంటి విద్వేష విభజన రాజకీయాలను దేశం ఏనాటికి అంగీకరించదని అన్నారు. పరస్పర సహకారం సహనం తో ప్రపంచ అభివృద్ధి జరుగుతుందే తప్ప ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహార అలవాట్లపై ద్వేషం పెంచుకోవడం వల్ల ఒనగూరేది ఏమీ లేదని అన్నారు. పర్యాటకులపై జరిగిన ఉన్మాద చర్యలకు వ్యతిరేకంగా బాధిత కుటుంబాలకు అండగా దేశ ప్రజానీకం నిలబడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆర్మీలో రెండు లక్షల పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి దేశ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు ఐక్యతతో దుశ్చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు మజ్జిగ ఆంజనేయులు, కృష్ణ, ఈశ్వర్, రఘు, అశోక్, నరేష్, రామకృష్ణ, భాస్కర్, నరసింహ, ఎళ్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List