వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లింల ర్యాలీ
- మద్దతుతెలిపిన గద్వాల ఎమ్మెల్యే, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్.
గద్వాల (లోకల్ గైడ్ ): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసహంరించుకోవాలని సోమవారం గద్వాల పట్టణంలో వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జెండాలతో నిరసన శాంతియుత ర్యాలీ చేపట్టారు. ధరూర్ మెట్ లోని దర్గా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ముస్లింలు చేపట్టిన ఈ ర్యాలీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్‌కేశవ్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి మద్దతు పలికారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముస్లింల పక్షన కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ సరితా తిరుపతయ్య జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తులను దోచుకునేందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చిందన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిని యావత్ జాతిపై దాడిగా గుర్తించి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రశాంతమైన దేశంలో మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వం అంటూ అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం బిజెపి పార్టీ కేంద్రంలో నల్ల చట్టాలను తెచ్చి రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
Comment List