భూదార్ సంఖ్య కేటాయింపు ద్వారా భూ ఆక్రమణలకు పులిస్టాప్
జిల్లా కలెక్టర్ సంతోష్
లోకల్ గైడ్:
మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. గురువారం మల్దకల్ మండలంలోని ఓ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూమి వివాదాలను పరిష్కరించి, రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ధరణీ స్తానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాపింగ్, వారసత్వ భూములు, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి కోర్టులకు వెళ్లాల్సి ఉండేదని, ఈ చట్టం ద్వారా అలాంటి సమస్యలకు అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. భూ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అవగాహన సదస్సుల అనంతరం అధికారులు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. రైతులు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలువురి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీఓ శ్రీనివాస రావు, మల్దకల్ తహసీల్దార్ షాహీదబేగం, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comment List